కామెడీ.. అప్పుడే కరోనా కట్టడిలో ఏపీ నెం.1 అట !

దేశంలో కరోనా సెకండ్ వేవ్… విజృంభిస్తోంది. రోజువారీ కేసులు మూడు లక్షలు దాటిపోయాయి. ఏపీలో ఈ కేసుల సంఖ్య రోజుకు పదివేల వరకూ ఉంది. ఉన్న పదమూడు జిల్లాల్లో ఐదు జిల్లాల్లో పాజిటివిటీ రేటు యాభై శాతం ఉందని.. స్వయంగా మంత్రి గౌతం రెడ్డి ప్రకటించారు. అంటే పరిస్థితి డేంజర్ స్టేజ్‌ను కూడా దాటిపోయిందన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లోనూ కరోనా కట్టడిలోనూ తాము నెంబర్ వన్ గా ఉన్నామని ఏపీ ప్రభుత్వం ప్రకటించుకోవడం హాస్యాస్పదం.

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. కర్నూలులో వైరస్‌ అంశంపై సమీక్షా సమావేశం పెట్టి… ఎప్పుడూ ఇచ్చే ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో కరోనా కట్టడిలో ఏపీ ముందంజలో ఉందని ప్రకటించుకున్నారు. ఏ రకంగా ముందుంది అన్నది మాత్రం ఆయన చెప్పలేదు. కరోనా సెకండ్ వేవ్ పై ఇంకా పోరాటమే మొదలు కాలేదు. పోరాటం కోసం పక్కా ప్రణాఌకలు రెడీ చేసే ప్లాన్ లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. రేపటి ఉన్నత స్థాయి సమావేశం అనంతరం దేశంలో మరోసారి లాక్ డౌన్ ప్రకటించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. 

ఇలాంటి పరిస్థితుల్లోనూ కరోనా కట్టాడిలో తామే నెంబర్ వన్ అని ఏపీ ప్రభుత్వం చంకలు గుద్దుకోవడం విశేషం. అంతేకాదు.. అసలు ఏపీలో ఆక్సిజన్ కొరత లేదని మరో ఏపీ మంత్రి ప్రకటించారు. మొత్తానికి.. ఏపీ మంత్రుల తీరు చూస్తుంటే.. ఏపీలో అన్ని బాగానే ఉన్నాయ్. తాము బాగానే చేస్తున్నాం అని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్టుంది.