ఉత్కంఠ పోరులో చెన్నై విజయం

టీ20లోని అసలు సిసలు మజాని పంచింది చెన్నై-కోల్ కతా మ్యాచ్. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌(64; 42 బంతుల్లో 6×4, 4×6), డుప్లెసిస్‌(95; 60 బంతుల్లో 9×4, 4×6) దంచి కొట్టారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 115 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అలీ(25; 12 బంతుల్లో 2×4, 2×6), ధోనీ(17; 8 బంతుల్లో 2×4, 1×6) కూడా ధాటిగా ఆడారు. దీంతో కోల్‌కతా ముందు ధోనీసేన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కోల్‌కతా బౌలర్లలో నరైన్‌, రసెల్‌, వరుణ్‌ చక్రవర్తి తలా ఓ వికెట్‌ పడగొట్టారు.

ఇక 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతాకు మొదటి ఓవర్ లోనే షాక్ తగిలింది. ఓపెనర్ శుభమన్ గిల్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా చహర టపాటపా మరో మూడు వికెట్లు తీశాడు. దీంతో.. 31 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఆ తర్వాత వచ్చిన పాట్‌ కమిన్స్‌(66 నాటౌట్‌; 34 బంతుల్లో 4×4, 6×6), ఆండ్రీ రసెల్‌(54; 22 బంతుల్లో 3×4, 6×6), దినేశ్‌ కార్తీక్‌(40; 24 బంతుల్లో 4×4, 2×6) ధాటిగా ఆడారు. సామ్‌కరన్‌ వేసిన 16వ ఓవర్‌లో కమిన్స్ నాలుగు సిక్సులు, ఒక ఫోర్‌ బాది మొత్తం 30 పరుగులు రాబట్టాడు. ఐతే అతడికి టెయిలెండర్స్ సహకారం లేకపోవడంతో విజయాన్ని అందించలేకపోయాడు. 19.1 ఓవర్లలో 202 పరుగులకు కోల్ కతా ఆలౌటైంది.