మోర్గాన్‌ కు కూడా ఫైన్

ఐపీఎల్ 2021లో స్లో ఓవర్‌ రేట్ కారణంగా కెప్టెన్లుకు ఫైన్లు పడుతున్నాయి. ప్రతి జట్టు 90 నిమిషాలలోపు 20 ఓవర్లను పూర్తిచేయాలి. దీనిని మొదటసారి ఉల్లంఘిస్తే.. సంబంధిత జట్టు కెప్టెన్‌కు రూ.12 లక్షల జరిమానా, రెండోసారి ఉల్లంఘిస్తే.. రూ.24 లక్షల జరిమానా విధించడంతోపాటు ఆ మ్యాచ్‌కు తుది జట్టులో ఉన్న ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధిస్తారు. ఇది మూడోసారి కూడా పునరావృతమైతే.. ఆ కెప్టెన్‌ ఒక మ్యాచ్‌ నిషేధానికి గురవుతాడు.

ఇప్పటికే చెన్నై సూపర్‌ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ, ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మలకు స్లో ఓవర్‌ రేట్ కారణంగా రూ.12 లక్షల జరిమానా విధించారు. తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ ఇయాన్ మోర్గాన్‌కు కూడా స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా జరిమానా పడింది. బుధవారం వాంఖడే వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌ చేసిన మోర్గాన్‌ సేన నిర్ణీత సమయంలోపు ఓవర్లు పూర్తి చేయలేకపోయింది. దీంతో కోల్‌కతా కెప్టెన్‌కు రూ.12లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ ప్రకటించింది.

ఇక మ్యాచ్ లో కోల్ కతా ఓడిపోయినా.. ప్రేక్షకుల మనసులు గెలిచేసింది. 221 పరుగుల భారీ లక్ష్యాన్ని దాదాపు చేధించినంత పని చేసింది. 31 పరుగులకే కోల్ కతా ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఆ తర్వాత వచ్చిన పాట్‌ కమిన్స్‌(66 నాటౌట్‌; 34 బంతుల్లో 4×4, 6×6), ఆండ్రీ రసెల్‌(54; 22 బంతుల్లో 3×4, 6×6), దినేశ్‌ కార్తీక్‌(40; 24 బంతుల్లో 4×4, 2×6) ధాటిగా ఆడారు. 19.1 ఓవర్లలో 202 పరుగులకు కోల్ కతా ఆలౌటైంది.