కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత MSR కన్నుమూత
కోవిడ్ కారణంగా కన్నుమూస్తున్న ప్రముఖుల జాబితా పెరుగుతూనే ఉంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం. సత్యనారాయణరావు 87 (ఎమ్మెస్సార్ ) కన్నుమూశారు. కొవిడ్ బారిన పడిన ఆయన నిమ్స్ లో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున 3.45 గంటలకు తుదిశ్వాస విడిచారు.
ఎమ్మెస్సార్ 1934 జనవరి 14న కరీంనగర్ లో జన్మించారు. 1954 నుంచి 1969 వరకు విద్యార్థి, యువజన నాయకుడిగా పనిచేశారు. 1969 ప్రత్యేక తెలంగాణ పోరాటంలో కీలకపాత్ర పోషించారు. 1971లో తెలంగాణ ప్రజా సమితి తరఫున కరీంనగర్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. టీపీఎఫ్ విలీనంతో కాంగ్రెస్ లోకి చేరారు. 1980 నుంచి 1983 వరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1985 నుంచి 1988 వరకు సుప్రీం కోర్టులో సీనియర్ కౌన్సిల్ గా పనిచేశారు.
1990 నుంచి 94 వరకు ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ గానూ బాధ్యతలు నిర్వర్తించారు. 2000 సంవత్సరం నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. అనంతరం వైఎస్ ప్రభుత్వంలో దేవాదాయ, క్రీడ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా పనిచేశారు. ఎమ్మెస్సార్ మృతిపట్ల సీఎం కేసీఆర్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.