కరోనా ఉదృతి.. GHMCలో ఇంటింటి సర్వే !

తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు సోయిలోకి వచ్చింది. రాష్ట్రంలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టెస్టుల కోసం వెళ్లిన గంటలకొద్ది క్యూ లైన్ లలో ఎదురు చూస్తున్నారు. తెల్లవారుజామున 5గంటల నుంచే లైన్ లో నిలబడుతున్నారు. టెస్టులు చేసే సిబ్బందివచ్చేది మాత్రం ఉదయం 11గంటల తర్వాతే. ఓ 50 మందికి చేసి.. వెళ్లిపోతున్నారు. దీంతో వందల మంది వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. చేసేదేమీ లేక.. అప్పులు తీసుకొని.. ప్రైవేటులో చేయించుకుంటున్నారు. ఒక్కో టెస్టుకు రూ. 2వేలపై మాటే.

ప్రభుత్వం మాత్రం ఇప్పుడు సోయిలోకి వచ్చింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతుండటంతో కొవిడ్‌ లక్షణాలు కలిగిన వారిని గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని.. ప్రతి బృందంలో ఇద్దరు మున్సిపల్‌ స్టాఫ్‌, ఇద్దరు ఆశా వర్కర్లు, ఒక ఏఎన్‌ఎం ఉండేలా చూడాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు స్పష్టం చేసింది. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ అధికారులని ఆదేశించారు. నగరంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, బస్తీ దవాఖానాలల్లో ఓపీ సేవలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.