ఈటెల వ్యవహారం.. ప్రభుత్వానికి కోర్టు చీవాట్లు !

టీఆర్ ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై వచ్చిన భూ ఆక్రమణ ఆరోపణలపై ప్రభుత్వం జెడ్ స్పీడుతో స్పందించిన సంగతి తెలిసిందే. సిర్ఫ్ 24 గంటల్లోనే దర్యాప్తుని పూర్తి చేసింది. ఈటెల తప్పు చేశాడని తేల్చేసింది. ఆయన్ని మంత్రి పదవి నుంచి కూడా బర్తరఫ్ చేసింది. ఈ వ్యవహారంలో ఈటల కుటుంబం హైకోర్టులో వేసిన అత్యవసర పిటిషన్‌పై విచారణ జరిగింది. 

ఈటల కుటుంబం తరఫున సీనియర్‌ న్యాయవాది దేశాయి ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. సర్వే చేసే ముందు తమకు నోటీసు ఇవ్వలేదని ఈటల కుటుంబం న్యాయస్థానానికి వివరించింది. అధికారులు తమ భూముల్లోకి అక్రమంగా చొరబడ్డారని తెలిపింది. కలెక్టర్‌ నివేదిక కూడా తమకు ఇవ్వలేదని చెప్పింది.

‘సర్వే చేసేందుకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదా.. రాత్రికి రాత్రే సర్వే ఎలా పూర్తయింది. ఫిర్యాదు వస్తే ఎవరి ఇంట్లోకైనా వెళ్లి విచారణ చేయొచ్చా?” అని ప్రశ్నించింది.  అధికారులు కారులో కూర్చొని నివేదిక రూపొందించినట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై స్పందించిన అడ్వొకేట్‌ జనరల్‌ పూర్తిస్థాయి విచారణ జరగలేదని వివరించారు. ప్రాథమిక విచారణ మాత్రమే చేసినట్లు తెలిపారు. తదుపరి చర్యలు చట్టప్రకారమే ఉంటాయని తెలిపారు.