మరికాసేపట్లో మీడియా ముందుకు కేసీఆర్.. ?
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. గత నెల 19న సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఎర్రవల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే ఉన్నారు. అక్కడే చికిత్స తీసుకున్నారు. మధ్యలో ఒకసారి పరీక్షల నిమిత్తం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వచ్చినప్పటికీ ప్రగతిభవన్‌కు వెళ్లలేదు.చికిత్స అనంతరం ఈ నెల 4వ తేదీన సీఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో సీఎం ఇవాళ ఎర్రవల్లి నుంచి ప్రగతిభవన్‌కు వచ్చారు. దాదాపు 20 రోజుల తర్వాత కేసీఆర్ ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం వైద్య, ఆరోగ్య శాఖ కూడా అదనంగా సీఎంకు చేరింది. దీంతో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, చికిత్స, టీకాల కార్యక్రమంపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే అధికారుల నుంచి సీఎం రిపోర్ట్స్ తెప్పించుకున్నారు. ఈ సాయంత్రం సుదీర్ఘంగా సమీక్షించనున్నారని తెలుస్తోంది. అనంతరం సీఎం మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారమ్. లాక్ డౌన్ పై కూడా మరోసారి క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారాంతరపు లాక్ డౌన్ విధించబోతున్నట్టు సమాచారమ్.