కరోనాతో హాకీ దిగ్గజం కన్నుమూత

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. సామాన్యులు, సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. వీరిలో కొందరు కరోనాతో పోరాటంలో ఓడిపోతున్నారు. ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతున్నారు. తాజాగా భారత హాకీ దిగ్గజాల్లో ఒకరైన రవీందర్‌పాల్‌ సింగ్‌ (60) కొవిడ్‌ కారణంగా కన్నుమూశారు. 

కరోనా వైరస్‌ సోకడంతో ఏప్రిల్‌ 24న లఖ్‌నవూలోని వివేకానంద ఆస్పత్రిలో రవీందర్ పాల్ సింగ్ ని చేర్చారు. వైరస్‌ నుంచి కోలుకోవడం, నెగెటివ్‌ రావడంతో గురువారం ఆయనను సాధారణ వార్డుకు తరలించారు. శుక్రవారం హఠాత్తుగా ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. అయినా.. ఆయన ప్రాణాలని కాపాడలేకపోయారు.

1980 మాస్కో ఒలింపిక్స్‌ విజేత జట్టులో ఆయన సభ్యుడు. రవీందర్‌పాల్‌ సింగ్‌ 1984 లాస్‌ ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌లోనూ ఆడారు. కరాచీ వేదికగా జరిగిన 1980, 83 ఛాంపియన్స్‌ ట్రోఫీల్లోనూ పాల్గొన్నారు. 1983 సిల్వర్‌ జూబ్లీ కప్‌ (హాంకాంగ్‌), 1982 ప్రపంచకప్‌ (ముంబయి), 1982 ఆసియా కప్‌ (కరాచీ) పోటీల్లో ఆడారు. 1979లో జూనియర్‌ ప్రపంచకప్‌లోనూ ప్రాతినిధ్యం వహించారు.