మాల్దీవుల్లో గొడవపై వార్నర్, స్లేటర్ వివరణ

ఐపీఎల్‌ 14వ సీజన్‌ వాయిదా పడటంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు, ఇతర సిబ్బంది ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్నారనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ ఓ బార్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌, వ్యాఖ్యాత మైఖేల్‌ స్లేటర్‌ మధ్య గొడవ జరిగిందని, ఇద్దరు కొట్టుకున్నారని ఓ అంతర్జాతీయ పత్రికలో కథనం ప్రచురితం అయింది.

తాజాగా ఈ కథనంపై వార్నర్‌, స్లేటర్‌ తాజాగా స్పందించారు. ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని, అవన్నీ తప్పుడు వార్తలని కొట్టిపారేశారు. ఈ విషయంపై స్లేటర్‌ ఓ విలేకరికి పంపిన సందేశంలో.. ‘ఆ పుకార్లలో ఎంతమాత్రం నిజం లేదు. వార్నర్‌ నాకు మంచి స్నేహితుడు. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు’ అని వివరించాడు.

ఇక వార్నర్‌ మాట్లాడుతూ ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయోనని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇక్కడ ఏం జరిగిందో చూడకుండా, సరైన ఆధారాలు లేకుండా ఇలాంటి తప్పుడు వార్తలు ఎలా రాస్తారని నిలదీశాడు.