సంచార జీవనంపై పూరి కామెంట్స్

దర్శకుడు జగన్నాథ్..  ‘పూరి మ్యూజింగ్స్‌’లో భాగంగా ‘నొమాడిక్‌’ (సంచార జీవనం)పై తన విశ్లేషణ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సంచార జీవనం గురించి పూరి మాటల్లోనే.. 


“నొమాడిక్‌.. అంటే సంచార జీవనం. సంచార జీవనానికి నిర్ణీత నమూనా అంటూ ఉండదు. అది ఒక జీవన విధానం. రష్యా, మంగోలియా వంటి దేశాల్లో ఎంతోమంది సంచార జీవనం సాగించేవారు ఇంకా ఉన్నారు. వేటాడుకుంటూ వలసపోతూ ఉంటారు. కుక్కలు, గొర్రెలు, గాడిదలు, గుర్రాలు, ఒంటెలు, ఆవులు పెంచుకుంటారు. జంతువుల చర్మంతో బట్టలు తయారు చేసుకుంటారు. నొమాడ్స్‌ అంటే.. ఏదో జాతిప్రజల గురించి అనుకోవద్దు. నేను చెప్పేది మన గురించే. మనందరం అలా వచ్చినవాళ్లమే. 

ఆ జాతికి చెందినవాళ్లమే.. పదివేల సంవత్సరాల క్రితం వరకూ 99శాతం ప్రజలు ఇలాంటివారే. ఇప్పటికీ వలస జీవితాలు బతుకుతున్నవారున్నారు. వాళ్లకు భవిష్యత్తు గురించి ఆలోచన లేదు. ఇప్పటి కోసం.. ఈ రోజు గురించి మాత్రమే బతుకుతారు. మనుషులు ఈ సంచార జీవితం గడిపినన్ని రోజులు బాగే ఉండేది. ఆ విధానం ఆగిన తర్వాత కష్టాలు మొదలయ్యాయి. ప్రాంతాలు.. దేశాలు.. సరిహద్దులు.. ఖండాలు.. జాతులు.. యుద్ధాలు.. కథలు.. చరిత్రలు.. ఇతిహాసాలు.. పక్షులు జంతువుల్లా మనుషులు కూడా ఇప్పటికీ సంచార జీవనం గడుపుతూ ఉండి ఉంటే ఏ గొడవ ఉండేది కాదు. 

”పట్టణాల్లో పుట్టి, చదువుకొని సంచార జీవనం గడిపేవాళ్లూ ఉన్నారు. వాళ్లను ‘డిజిటల్‌ నొమాడ్స్‌’ అంటారు. వాళ్లు ఒకచోట ఉండరు. వాళ్లకు ప్రత్యేకంగా ఇల్లు ఉండదు. ప్రపంచమంతా తిరుగుతూ ఉంటారు. బతకడం కోసం ఆన్‌లైన్‌లో ఉద్యోగం చేస్తారు. బ్లాగ్స్‌ రాస్తారు.. ట్రావెల్‌ వీడియోలు చేస్తారు.. పుస్తకాలు అమ్ముతారు. ఆర్టికల్స్‌ రాస్తారు. అందులో కొంతమంది ఫొటోగ్రాఫర్లు కూడా ఉంటారు. ఇలా ఎన్నోరకాల పనులు చేస్తూ సంచార జీవితం గడుపుతున్నవారెంతో మంది ఉన్నారు” అంటూ చెప్పుకొచ్చారు.