గుడ్ న్యూస్ : దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. ఆక్సిజన్ అందక కరోనా రోగులు ప్రాణాలు విడిస్తున్నారు. ఐతే ఇటీవల రోజువారీగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల కనిపించడం ఊరటనిచ్చే విషయం. గడిచిన 24 గంటల్లో దేశంలో 3.66లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. క్రితంరోజుతో పోలిస్తే..  కొత్త కేసులు దాదాపు 35వేలకు పైగా తగ్గడం గమనార్హం. 

నిన్న 3,66,161 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.2కోట్లకు చేరింది.  ఇదే సమయంలో 3754 మంది కరోనాతో మృత్యుఒడికి చేరుకున్నారు. దీంతో వైరస్‌ ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు 2,46,116 మందిని కొవిడ్‌ బలితీసుకుంది. మరణాల రేటు 1.09శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 3,53,818 మంది కరోనాను జయించారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1.86కోట్లకు చేరగా.. రికవరీ రేటు 82.15శాతానికి పెరిగింది.  ప్రస్తుతం 37,45,237 మంది వైరస్‌కు చికిత్స తీసుకుంటుండగా.. క్రియాశీల రేటు 16.76 శాతంగా ఉంది.