ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై ఈటెల క్లారిటీ

ఆపరేషన్ ఈటెలని సీఎం కేసీఆర్ విజయవంతంగా పూర్తి చేశారు. ఆయన్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఇందుకోసం ఈటెలపై భూ ఆక్రమణ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమిక విచారణ చేపట్టింది. ఈటెలని దోషిగా తేల్చింది కూడా. ఐతే, ఈ రకమైన విచారణపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ.. పక్కగా చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దానికి సంబంధించిన విచారణ భవిష్యత్ లో జరగనుంది.

మరోవైపు ఈటెల ఆచుతూచి వ్యవహారిస్తున్నారు. సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలకు పోకుండా.. నెమ్మదిగా దూకుడు పెంచుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇందులో సీఎం కేసీఆర్ మనస్థత్వంకు సంబంధించి.. పలు ఉదాహరణలు కూడా ఇచ్చారు. అంతేకాదు.. తెరాసతో బంధం వందశాతం తెగిపోయినట్టేనని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే పదవికి తప్పకుండా రాజీనామా చేస్తా. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు బాగులేవు. పరిస్థితులు చక్కబడ్డాక.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ప్రజల సమక్షంలో తేల్చుకుంటానని ఈటెల క్లారిటీ ఇచ్చారు. 

మరోవైపు హుజూరాబాద్ లో ఈటెలని ఓడించడానికి.. తెరాస ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. ఈటెలపై పోటీకి ఎవరు సరైనోడు ? అనే అంశంపై చర్చలు సాగిస్తోంది. ఈ క్రమంలో ఓ యువనేత పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటి నుంచి ఈటెల సన్నిహితులు, స్నేహితులు, తెరాస వర్గాలని తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు మొదలెట్టింది.