టీ20 ప్రపంచకప్ వాయిదా తప్పదా ?
కోవిడ్ ఉదృతి నేపథ్యంలో ఐపీఎల్ 14 సీజన్ నిరవధిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. బయో బుడగలోని ఆటగాళ్లకు వైరస్ సోకడమే ఇందుకు కారణం. కోల్‌కతా ఆటగాళ్లు సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తి, సన్‌రైజర్స్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా, దిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రాకు సీజన్ మధ్యలో పాజిటివ్ వచ్చింది. బుడగ బలహీన పడటం, ఆటగాళ్లు ఆందోళనకు లోనవ్వడంతో లీగ్‌ను వాయిదా వేయక తప్పలేదు. క్రమంలో ఐసీసీ టీ20 ప్రపంచకప్ వేదిక తరలింపునకు లేదా వాయిదా వేయడం తప్పకపోవచ్చని ఆస్ట్రేలియా మాజీ సారథి ఇయాన్ ఛాపెల్ అభిప్రాయపడ్డారు.
‘కరోనా వైరస్ కారణంగా ప్రజలు మరణించడం, ఆటగాళ్లకు వైరస్ సోకడంతో ఐపీఎల్ 2021 సీజన్ వాయిదా పడింది. అంటే తర్వాత జరిగే ఆటకూ ఈ ప్రమాదం తప్పదని తెలుస్తోంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్ నిరవధిక వాయిదా మాదిరిగానే మిగతా టోర్నీలకూ ముప్పు తప్పకపోవచ్చు. భారత్‌లో అక్టోబర్లో జరిగే టీ20 ప్రపంచకప్ వేదికను మార్చాల్సి రావొచ్చు. లేదా వాయిదా వేయాల్సి రావొచ్చు’ అని ఛాపెల్ అన్నాడు.