కన్నీరు పెట్టిస్తున్న.. TNR ఆఖరి మాటలు !
ప్రముఖ జర్నలిస్ట్, నటుడు TNR మృతితో టాలీవుడ్ విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ ప్రముఖులు, ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. కరోనా కల్లోల పరిస్థితులపై టీఎన్‌ఆర్ మాట్లాడిన ఆఖరి మాటలు ఇవేనంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో కరోనా జాగ్రత్తలు చెప్పిన టీఎన్నార్.. ఆ మహమ్మారికే బలికావడం కన్నీరు పెట్టిస్తోంది.
“యోగా, ప్రాణాయామం చేయటం, ఇమ్యూనిటీ పెంచుకోవటం, ధైర్యంగా ఉండటం ద్వారా కరోనాను జయించవచ్చని టీఎన్‌ఆర్ అందులో వివరించారు. నేను టీఎన్‌ఆర్. ఎక్కడికీ వెళ్లడం లేదు. మంచి పుస్తకాలు చదువుతున్నా. చెడులో కూడా మంచి వెతుక్కోవాలని మన పెద్దలు చెబుతారు. ఈ కష్ట సమయమన్నది నాకు మంచి అలవాటు నేర్పింది. అదే ప్రాణాయామం.. యోగా. రోజూ ప్రాణాయామం చేస్తున్నా.
నా పిల్లలతో కూడా చేయిస్తున్నా. ఈ సమయంలో పిల్లలతో బాగా గడపండి. వాళ్లకు మంచి విషయాలు చెప్పండి. భవిష్యత్‌లో వచ్చే కష్టాలను ఎలా ఎదుర్కోవాలో వివరించండి. వాళ్ల పనులు వాళ్లే సొంతంగా చేసుకునేలా తీర్చిదిద్దండి.మనం మానసికంగా కుంగిపోతే, మన ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతుంది. ఇందుకోసం ప్రాణాయామం చేయాలి. అందరూ జాగ్రత్తలు పాటిస్తూ, కరోనాను జయిద్దాం” ఆ వీడియాలో టీఎన్నార్ చెప్పడం చూడొచ్చు.