ఏపీ అంబులెన్స్ ఎందుకు ఆపారు ? రంజాన్ తర్వాతే కరోనా కట్టడిపై చర్యలు చేపడతారా ??
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ మరోసారి చివాట్లు పెట్టింది. రాష్ట్రంలో పరిస్థితులపై ఉన్నత న్యాయస్థానంలో ఇవాళ విచారణ జరిగింది. ఏ అధికారంతో రాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్స్‌లు ఆపారని హైకోర్టు ప్రశ్నించింది. రంజాన్ తర్వాతే కరోనా కట్టడిపై తదుపరి చర్యలు చేపట్టాలని భావిస్తున్నారా ? అని సూటిగా ప్రశ్నించింది. మతపరమైన కార్యక్రమాలను ఎందుకు నియంత్రించడం లేదని ప్రశ్నించింది. ప్రభుత్వం చెప్పే విషయాలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేదని చివాట్లు పెట్టింది.
ఈ మధ్యాహ్నం జరిగే కేబినెట్ సమావేశంలో కరోనా కట్టడిపై నిర్ణయాలు తీసుకుంటామని ఏజీ కోర్టుకు తెలిపారు. తమ ఆందోళనను కేబినెట్ దృష్టికి తీసుకెళ్లాలని కోర్టు ఈ సందర్భంగా సూచించింది. కేబినెట్ సమావేశం అయ్యే వరకు విచారణ వాయిదా వేయాలని ఏజీ ధర్మాసనాన్ని కోరారు. దీంతో కోర్టు తదుపరి విచారణను మధ్యాహ్నం 2.30గంలకు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కేబినేట్ లో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు. రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్ డౌన్ విధిస్తారా ? లేక ఏపీ తరహా పాక్షిక లాక్ డౌన్ వైపు మొగ్గు చూపుతారా?? అన్నది ఆసక్తిగా మారింది.