ఆక్సిజన్ అందక.. గిలగిలా కొట్టుకుని చనిపోయారు !
తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో 11 మంది మృతి చెందారు.ఆక్సిజన్ ట్యాంకు ఖాళీ కావడంతో 25 నిమిషాల పాటు సరఫరా నిలిచిపోయింది. దీంతో కరోనా రోగులు ఊపిరి ఆడక గిలగిల కొట్టుకొని చనిపోయారు. అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే తమవారి ప్రాణాలు కళ్ల ముందే పోయాయని తిరుపతి రుయా ఆస్పత్రిలో మృతిచెందిన వారి బంధువులు ఆరోపించారు.
అప్పటి వరకూ తమతో నవ్వుకుంటూ మాట్లాడిన వారు.. ఉన్నట్టుండి గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచారని కన్నీటి పర్యంతమయ్యారు. ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోతుంటే పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై న్యాయస్థానం, మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు.