పాజిటివిటీ 10శాతం మించితే.. లాక్‌డౌన్ !
ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో కర్ఫ్యూ, లాక్‌డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివిటీ 10శాతం మించిన జిల్లాల్లో 6 నుంచి 8వారాల పాటు లాక్‌డౌన్ అవసరమని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) సూచించింది.
అధిక పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో పూర్తిలాక్‌డౌన్ ఉండాల్సిందే. అక్కడ పాజిటివిటీ రేటు 10 నుంచి 5శాతానికి తగ్గితే ఆంక్షలను సడలించవచ్చు. అలా జరగాలంటే 6 నుంచి 8 వారాలు అవసరమని ఓ ఇంటర్వ్యూలో ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ పేర్కొన్నారు.
ఇక దేశంలో కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో గోవా తొలిస్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, హరియాణా, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. పాజిటివిటీ 10 శాతం మించిన ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించాలని కేంద్రం గతంలోనే సూచించిన విషయం తెలిసిందే.