హరీష్ రావుకు పెరిగిన ప్రాధాన్యత.. ! ఈటెల ఎఫెక్ట్ యేనా ?

గతంలో హరీష్ రావుని తొక్కేయాలనే ప్రయత్నాలు జరిగినట్టు ప్రచారం జరిగింది. రెండు దఫా టీఆర్ఎస్ గెలిచిన వెంటనే హరీష్ రావుకు మంత్రి పదవి రాలేదు. అంతేకాదు.. టీ-న్యూస్ లో హరీష్ రావుపై అనధికారిక బ్యాన్ విధించారనే వార్తలు వినిపించాయి. కేటీఆర్ కోసం హరీష్ ని తొక్కేస్తున్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. ఫైనల్ హరీష్ విషయంలో సీఎం కేసీఆర్ పై ఒత్తిడి పెరిగింది. దీంతో హరీష్ రావుని మళ్లీ మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఆర్థికశాఖ అప్పగించారు. అయినప్పటికీ.. హరీష్ పై చిన్నచూపు కొనసాగుతుందనే టాక్ ఉంది.

ఇటీవల మాత్రం హరీష్ రావుకు ప్రభుత్వం ప్రాధాన్యం పెరిగింది. ఈటల రాజేందర్ ఇష్యూ తర్వాత.. మళ్లీ కీలక కార్యక్రమాల్లో హరీష్ రావును కేసీఆర్ భాగస్వామ్యం చేయడం ప్రారంభించారు. కేటీఆర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కరోనా టాస్క్‌ఫోర్స్‌లో హరీష్ రావు కూడా కీలక బాధ్యతలు చేపట్టారు. కేటీఆర్, హరీష్‌లలో ఒకరు తెలంగాణ లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర మంత్రులతో సమన్వయం చేస్తుంటే మరొకరు ఆక్సిజన్ కొరత , ఇంజక్షన్ల సరఫరాలను పర్యవేక్షిస్తున్నారు. ఈటల… హరీష్ రావు సన్నిహుతులని.. టీఆర్ఎస్‌లో ఎప్పట్నుంచో ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. హరీష్ కు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పుకొంటున్నారు.