ఆంధ్ర వాళ్ల ఓట్లు కావాలి.. కానీ వైద్యం అందించరా ?

కరోనా విజృంభిస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరి విమర్శలకు దారితీస్తోంది. ఏపీ నుంచి వస్తున్న అంబులెన్స్ లని తెలంగాణలో సరిహద్దుల్లో ఆపేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. మెరుగైన చికిత్స కోసం తమని హైదరాబాద్ కు అనుమతించాలని కోరుతున్నారు. దండం పెడుతున్నారు. అయినా..  తెలంగాణ ప్రభుత్వంలో చలనం లేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిప్పులు చెరిగారు. 

ఏపీ వారి ఓట్లు కావాలి కానీ.. వాళ్ళకు వైద్యం మాత్రం అందించరా? అంటూ సీఎం కేసీఆర్‌ను రాజాసింగ్ సూటిగా ప్రశ్నించారు. ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులను ఆపడం సరైన చర్య కాదని మండిపడ్డారు. హైదరాబాద్ మెడికల్ హాబ్ అని సీఎం కేసీఆర్ అంటారు.. హైదరాబాద్ వైద్యం కోసం వస్తే.. నిబంధనలు పెడతారా ? అంటూ నిలదీశారు. ఏపీ నుంచి వచ్చే రోగులను ఆపడం చాలా దారుణమన్నారు. ఇక తెలంగాణ సరిహద్దు పుల్లూరు చెక్ పోస్టు వద్ద పెద్దఎత్తున ఏపీ అంబులెన్సులు బారులు తీరాయి. అవి హైదరాబాద్ వెళ్లేందుకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు.