వెలుగులోకి ‘కొవిడ్‌ టంగ్‌’

కరోనా మహమ్మారి కొత్త రూపాలు సంతరించుకుంటోంది. ఇప్పటివరకు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, జలుబు, వాసన గుర్తించలేకపోవడం, రుచి తెలియకపోవడంతో పాటు కొందరిలో కళ్లు ఎర్రబారడాన్ని కూడా కరోనా లక్షణాలుగా పరిగణించారు. ఇప్పుడు మరో కొత్తరకం వెలుగులోకి వచ్చింది. 

ఇటీవల కొంత మందిలో నోరు ఎండిపోవడం, నాలుక దురదగా అనిపించడం, నాలుకపై గాయాలు కావడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు తెలిపారు. దీన్నే ఇప్పుడు ‘కొవిడ్‌ టంగ్‌’గా పేర్కొంటున్నారు. ఈ లక్షణాలు కనిపించిన వారిలో నీరసం, విపరీతమైన అలసట కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ లక్షణాలతో వచ్చిన వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రెండు లక్షణాలు కనిపించేవారు వెంటనే అప్రమత్తం కావడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.