రఘురామకు ప్రాణహాని.. గవర్నర్’కు లేఖ !
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో పోలీసులు కోర్టు తీర్పుని ధిక్కరించే ప్రయత్నం చేశారు. రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణం రాజును తరలించాలని సీఐడీ కోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినప్పటికీ, పోలీసులు ఆయనను రిమాండ్ కు తరలించడానికి ప్రయత్నించారు. ఇంతలో హైకోర్ట్ జోక్యం చేసుకొని సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. సీఐడీ కోర్టు ఆదేశాలను పోలీసులు పాటించాలని, రఘురామకృష్ణంరాజు ని తక్షణమే జైలు నుండి రమేష్ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
అంతకముందు మీడియా ముందుకొచ్చిన రఘురామకృష్ణంరాజు సతీమణి రమాదేవి.. తన భర్తను ఇవాళ జైలులో చంపడానికి పోలీసులు కుట్ర చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కడప నుండి కొందరు వ్యక్తులు ఈ కుట్రలో భాగంగా చేరుకున్నారని తమకు సమాచారం ఉందని ఆమె అన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు కూడా ఇవే ఆరోపణలు చేశారు. రఘురామకు ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉందని చంద్రబాబు అన్నారు. ఈమేరకు గవర్నర్ బిశ్వభూషణ్‌కు ఆయన లేఖ రాశారు. ఎంపీ ప్రాణాలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. తనకు ప్రాణహాని ఉందని రఘురామ గతంలోనే చెప్పారనీ, దీనిని గుర్తించే కేంద్రం ఆయనకు వై-కేటగిరి భద్రత కల్పించిందని చంద్రబాబు పేర్కొన్నారు.