ఏబీడి అభిమానులకు నిరాశ
మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఏబీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చే అవకాశం లేదని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తేల్చి చెప్పింది. 2018 మే నెలలో డివిలియర్స్ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసిందే.
ఐతే, అతడు రిటైర్మెంట్ వెనక్కి తీసుకొని తిరిగి క్రికెట్ ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఏబీడి కూడా తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని ఉందన్నాడు. రాబోయే టీ20 ప్రపంచకప్‌కు ముందు పునరాగమనం చేస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పాడు.
ఈ నేపథ్యంలో డివిలియర్స్ మళ్లీ దేశం తరుపున ఆడటం ఖాయమని అభిమానులు అనుకున్నారు. కానీ వారి ఆశలపై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నీళ్లు చల్లింది. ఒకసారి రిటైర్మెంట్ ప్రకటించాక అదే అంతిమ నిర్ణయమైనట్లు ఏబీడి పేర్కొన్నాడని చెప్పింది. అందులో డివిలియర్స్ మనసు మార్చుకునే ఉద్దేశం లేదని బోర్డు స్పష్టం చేసింది. దక్షిణాఫ్రికా బోర్డు తాజా ప్రకటన అభిమానులకు నిరాశ కలిగించింది.