కేసీఆర్’కు ఈటెల తీవ్ర హెచ్చరికలు
హఠాత్తుగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయబడిన ఈటెల రాజేందర్ గేర్ మార్చారు. తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్ లో.. తన వర్గాన్ని టార్గెట్ చేస్తుండటం తట్టుకోలేకపోయాడు. నేరు సీఎం కేసీఆర్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
“2023 తర్వాత నీ అధికారం ఉండదు. ఇప్పుడు మీరేం చేస్తున్నారో.. ఆ తర్వాత మేమూ ఆ పని తప్పకుండా చేస్తామని హెచ్చరిస్తున్నా. బ్లాక్‌మెయిల్ రాజకీయాలు పనికిరావు. మర్యాదగా నడుచుకోండి.
మా ప్రజలు నన్ను 20 ఏళ్లుగా గుండెళ్లో పెట్టుకున్నారు. దేవుళ్లను మొక్కను.. ప్రజల హృదయాలనే గుడులుగా భావిస్తా. ఆపదలో ఉంటే ఆదుకునే ప్రయత్నం చేస్తుంటా. తల్లిని బిడ్డను వేరు చేసే ప్రయత్నం చెల్లదు.
హుజూరాబాద్‌లో ఇప్పుడు ఎన్నికలు జరిగే ప్రసక్తి లేదు. ఒక వేళ ఎన్నికలు జరిగితే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్లు సకల జనులు, ఉద్యమకారులంతా నాకు, ఇక్కడి ప్రజలకు అండగా ఉంటారు.
హుజూరాబాద్ ప్రజల్ని ఎవరూ కొనలేరు. ఇక్కడి ప్రజలు అనామకులు కాదు. ప్రజల్ని రెచ్చగొట్టొద్దు. దాదాగిరి పద్ధతి, హెచ్చరికలను ఆపకపోతే కరీంనగర్ కేంద్రంగానే ఉద్యమం చేయాల్సి ఉంటుంది” అని ఈటల హెచ్చరించారు.