సాయం చేసినా.. సంతోషం లేదు !
నటి రేణు దేశాయ్ గొప్ప మనసు చాటుకుంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉదృతి నేపథ్యంలో తనవంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆసుపత్రులలో పడకలు ఏర్పాటు చేయించడం, అవసరమైన వారికి ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర మెడికల్ వసతులను అందిస్తున్నారు. ఐతే సాయం చేయడంలో సంతోషం కన్నా బాధే ఎక్కువగా ఉందని రేణు తెలిపారు.
‘కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ అందక రోజూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని వార్తల్లో చూసి నాకు చేతనైనంత సాయం చేద్దామని ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టాను. ఆ సమయంలో కేవలం 25 నుంచి 30 మంది మాత్రమే సాయం కోసం వస్తారని భావించాను. కానీ మొదటిరోజే నాకు సుమారు 100 పైగా మెస్సేజ్‌లు వచ్చాయి. అవన్నీ చూసి షాకయ్యాను. అదే సమయంలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు వ్యక్తులు ఒక టీమ్‌గా ఫామ్ అయ్యి నాకు సాయం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.
నాకు వచ్చిన మెస్సేజ్‌లు ఏ ప్రాంతానికి చెందినవి అయితే ఆ ప్రాంతానికి చెందిన మా టీమ్ సభ్యులకు చెప్పి బాధితులకు తగినంత సాయం చేస్తున్నాను. కానీ సాయం పొందేలోపే కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాటి వల్ల ప్రతిక్షణం కుంగుబాటుకు లోనవుతున్నాను. ఒక్కోసారి ఏడ్చేస్తున్నాను కూడా. మా సాయం పొంది కోలుకున్నవారు థ్యాంక్స్ చెబుతూ మెస్సేజ్‌లు పెడుతున్నారు. దానికి సంతోషించినప్పటికీ.. మిగిలిన వాళ్లని కాపాడలేకపోయామే అనే బాధే నాకు ఎక్కువగా అనిపిస్తుంది’ అని రేణూ తెలిపారు.