లాక్‌డౌన్లు పని చేస్తున్నాయ్ !

కరోనా సెకండ్ వేవ్ కట్టడి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయనే అపవాదు ఉంది. కరోనా ఫస్ట్ వేవ్ లో ప్రధాని నరేంద్రమోడీ చాలా త్వరగా అలర్ట్ అయ్యారు. దేశంలో లాక్‌డౌన్ విధించారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్ తప్ప మరో ఆప్షన్ లేదన్నారు. అది మంచి ఫలితాలనే ఇచ్చింది. చాలా తక్కువ డ్యామేజ్ తో దేశం బయటపడింది. ఐతే కరోనా సెకండ్ వేవ్ లో మాత్రం ప్రధానికి ముందు చూపు కరువైంది. లాక్‌డౌన్ కి నో చెప్పారు. లాక్‌డౌన్ అనేది ఆఖరి అస్త్రంగా మాత్రమే వాడాలన్నారు. 

ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కరోనా సెకండ్ వేవ్ విశ్వరూపం దాల్చింది. భారత్ పేరు చెబితేనే ఇతర దేశాలు భయపడే స్థాయికి చేరుకొంది. భారత్ ని పక్కదేశాలు రెడ్ లిస్టులో పెట్టడం ప్రారంభించాయి. అప్పటికీ లాక్‌డౌన్ కి కేంద్రం నో చెప్పింది. ఆ బాధ్యత రాష్ట్రాలదే అంటూ.. చావు కబురుని చల్లగా చెప్పేశారు. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తపడి లాక్‌డౌన్ ని ఆశ్రయించాయి.

తెలంగాణ వంటి మరికొన్ని రాష్ట్రాలు ఈ విషయంలో జాప్యం చేశాయి. మొత్తానికి.. అత్యధిక రాష్ట్రాలు లాక్‌డౌన్ ని ఆశ్రయించక తప్పలేదు. ఐతే లాక్‌డౌన్లు పని చేస్తున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఐతే మృతుల సంఖ్య పెరుగుతుండటం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.

ఆదివారం దేశంలో 2,22,315 కొత్త కేసులు నమోదయ్యాయ్. క్రితంరోజుతో పోల్చితే స్వల్ప తగ్గుదల కనిపించింది. మరోవైపు, 24 గంటల వ్యవధిలో మరోసారి భారీగా మరణాలు సంభవించాయి. నిన్న 4,454 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇప్పటివరకు 2,67,52,447 మందికి కరోనా సోకగా..3,03,720 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రియాశీల కేసులు రోజురోజుకు తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది. క్రియాశీల రేటు 10.17 శాతానికి చేరింది. రికవరీరేటు 88.69 శాతానికి చేరింది.