బ్లాక్‌ ఫంగస్‌కు కారణం.. షాకింగ్ విషయాలు !

 కరోనా రోగుల్లో బ్లాక్‌ ఫంగస్‌ సమస్య తలెత్తడానికి కారణం స్టిరాయిడ్స్‌ను విచక్షణారహితంగా వినియోగించడమేనని వైద్య నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ ఇన్‌ఫెక్షన్‌ తలెత్తడానికి స్టెరాయిడ్స్, మధుమేహానికి మించి ఇతరత్రా కారణాలున్నట్లు ప్రొఫెసర్‌ వీపీ పాండే చేసిన అధ్యయనంలో తేలింది. 


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మహాత్మాగాంధీ స్మారక వైద్య కళాశాలలో మెడిసిన్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ వీపీ పాండే 210 మంది బ్లాక్‌ ఫంగస్‌ రోగులపై చేసిన అధ్యయన వివరాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ అధ్యయనం ప్రకారం బ్లాక్‌ ఫంగస్‌ సోకినవారిలో 14% మంది స్టెరాయిడ్స్‌ ఉపయోగించలేదు. 21% మందికి మధుమేహం లేదు. 36% మంది హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. 52% మంది రోగులు మాత్రమే బయటి నుంచి ఆక్సిజన్‌ తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో బ్లాక్ ఫంగస్ రావడానికి స్టెరాయిడ్స్, మధుమేహానికి మించి ఇతరత్రా కారణాలున్నట్లు అనిపిస్తోంది. అజిత్రోమైసిన్, డాక్సీసైక్లిన్, కార్బాపెనెమ్స్‌ యాంటీ బయాటిక్సే కూడా కారణం కావొచ్చని ఈ అధ్యయనం బట్టీ అర్థమవుతోంది. ఇక తెలంగాణలో బ్లాక్ ఫంగస్ రోగుల సంఖ్య ఆదివారానికి 102కు చేరింది. వీరంతా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.