గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి.. ప్రోటో కాల్ లో చేర్చిన కేంద్రం !
గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందా ? వ్యాప్తిస్తే ఎంత దూరం వరకు వ్యాప్తి ఉంటుంది ? అనే ప్రశ్నలు తలెత్తాయ్. ఐతే ఇప్పటికే కరోనా మహమ్మారి గాలి ద్వారా వ్యాప్తిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్రం కూడా ప్రకటించింది. తాజాగా విషయాన్ని కొవిడ్ నియమాల్లో చేర్చింది.
తుంపర్ల ద్వారా గాలిలో వైరస్ దాదాపు 10 మీటర్ల వరకు ప్రయాణించగలదు. ఎప్పుడూ మూసి ఉంచే గదుల్లో ఈ ఏరోసోల్స్ ప్రమాదకరంగా మారుతున్నాయి. వీటి ద్వారానే గాలి నుంచి వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. అందుకే ఇళ్లు, పని ప్రదేశాల్లో గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.
సాధారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య 1 మీటరు కంటే తక్కువ దూరం ఉన్న సమయంలో నోటి తుంపర్ల నుంచి ఎదుటివారికి కళ్లు, నోరు, ముక్కు ద్వారా సోకే ప్రమాదం ఉంటుంది. కానీ వెంటిలేషన్ తక్కువగా ఉన్న ప్రాంతాలు/రద్దీగా ఉండే ఇంటిలోపలి ప్రాంతాల్లో వైరస్ మీటరు కంటే ఎక్కువ దూరం ప్రయాణించే ఆస్కారం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సూచనను కేంద్ర ఆరోగ్యశాఖ సవరించిన ప్రోటోకాల్లో చేర్చింది. దీంతో పాటు స్టెరాయిడ్ల వినియోగాన్ని కేంద్ర కొవిడ్ నియమాల్లో చేర్చింది.