గులాబి గూటికి ఎల్ రమణ ?

తెలంగాణ తెదేపాకు గట్టి షాక్ తగలనుంది. ఆ పార్టీ అధ్యక్షుడు, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే ఎల్‌.రమణ తెరాసలో చేరబోతున్నట్టు సమాచారమ్. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామా నేపథ్యంలో హుజూరాబాద్‌ ఉపఎన్నిక అనివార్యం కానుంది. దీంతో.. కరీంనగర్ కు చెందిన నేతలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అందులోనూ బీసీ నేతలైతే హాటు కేకులే. వారికి భారీ ఆఫర్లు ప్రకటించి తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి తెరాస, భాజాలు. ఎల్ రమణ కోసం భాజాపా, తెరాసలు ట్రై చేస్తున్నాయి. ఐతే రమణ మాత్రం తెరాస వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే రమణతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడినట్టు సమాచారమ్. త్వరలో ఎమ్మెల్యేల కోటాలో ఆరు, గవర్నర్‌ కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే తెరాస ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఆఫర్‌ చేసినట్లు సమాచారం. ఈటెల రాజేందర్ బీసీ నేత. బలమైన నేత. సీఎం కేసీఆర్ కు సరితూగే నేత. అలాంటి నేతని… సొంత నియోజకవర్గంలో మట్టి కరిపించాలంటే.. ఎల్. రమణ లాంటోళ్లు చాలా మందే కావాలి. అందుకే ఏ బుట్ట బీసీ నేతని వదలకుండా.. బుట్టలో వేసుకొనే ప్రయత్నాల్లో తెరాస ఉంది. ఇందుకోసం స్వయంగా మంత్రులే రంగంలోకి దిగుతున్నారు. ప్యాకేజీలు, పదవులతో ఎరవేస్తున్నరు.