కేంద్ర మంత్రులతో జగన్ భేటీ.. ఏం చర్చించారంటే ?
రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం జగన్ వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఆ తర్వాత కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసిన జగన్ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించినట్టు తెలిసింది. రాత్రి 9గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం భేటీ కానున్నారు. అమిత్ షాతో జగన్ చర్చించనున్న అంశాలేంటీ ? అన్నది ఆసక్తికరంగా మారింది.
గతసారి ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడు.. వైసీపీ ఎన్ డీయేలో చేరనుంది. ఇందుకు ఫలితంగా వైసీపీకు రెండు మూడు కేంద్ర మంత్రి పదవులు దక్కనున్నాయనే ప్రచారం జరిగింది. ఐతే ఈసారి మాత్రం అలాంటి ప్రచారమేమీ లేదు. ఏపీ రావాల్సిన, శాఖలవారీగా కావాల్సిన పనులపై సీఎం జగన్ కేంద్ర మంత్రులని కలిసినట్టు తెలుస్తోంది. ఇక రేపు ఉదయం వాణిజ్య, రైల్వే, పెట్రోలియం శాఖ మంత్రులతో భేటీ కానున్నారు. రాత్రికి దిల్లీలోనే బస చేయనున్న సీఎం.. రేపు మధ్యాహ్నం రాష్ట్రానికి తిరిగి రానున్నారు