సుశాంత్ జీవిత కథ.. పిటిషన్ కొట్టివేత !

సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ గతేడాది జూన్‌ 14న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన సుశాంత్‌ మరణంపై దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు సుశాంత్‌ జీవిత కథ ఆధారంగా ‘న్యాయ్‌:ది జస్టిస్‌’, ‘సూసైడ్‌ ఆర్‌ మర్డర్‌: ఏ స్టార్‌ వాస్‌ లాస్ట్‌’తో పాటు మరికొన్ని చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ‘న్యాయ్‌’ జూన్‌ 11న (శుక్రవారం) విడుదల కావాల్సి ఉంది. ఇందులో సుశాంత్‌సింగ్‌ పాత్రలో జుబర్‌ కె.ఖాన్‌ కనిపించనున్నాడు. ఈ చిత్రానికి దిలీప్ గులాటి దర్శకత్వం వహించారు. 

ఈ క్రమంలోనే.. తన కుమారుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీసేలా సినిమాలు తీయకుండా చూడాలని ఢిల్లీ హైకోర్టులో కె.కె.సింగ్‌ గత ఏప్రిల్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. సుశాంత్‌ పేరు గానీ.. అతని ప్రస్తావనను గానీ.. తెరపై చూపించకుండా నిరోధించాలన్నారు. అయితే సుశాంత్ తండ్రి అభ్యర్థనని హైకోర్ట్ తోసిపుచ్చింది. కె.కె.సింగ్‌ అభ్యర్థనను కొట్టివేసింది. న్యాయ్‌ విడుదలను అడ్డుకోవడం కుదరదని తేల్చి చెప్పింది.