వాసలమర్రికి కేసీఆర్.. వెనక ఆలేరు రాజకీయం ?
సీఎం కేసీఆర్ మరోసారి సహపంక్తి రాజకీయాలకి తెరలేపారు. ఈనెల 22న యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసలమర్రి గ్రామానికి వెళ్లనున్నారు. గ్రామస్తులతో కలిసి సీఎం భోజనం చేయనున్నారు. ఆ తర్వాత గ్రామసభ నిర్వహించి సమస్యలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ వరాజ జల్లు కురిపించనున్నారు.
అవి ఏ రేంజ్ లో ఉంటాయన్నది తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. అవి అమలు అవుతాయా ? లేదా ?? అన్నది తర్వాతి సంగతి. కానీ వరాల జల్లు కురిపిస్తూ.. గ్రామస్థులని గాల్లో విహరించేలా మాత్రం చేసి వస్తాడు కేసీఆర్. ఈ విషయం పక్కనపెడితే.. వాసలమర్రి విజిట్ వెనక సీఎం కేసీఆర్ భవిష్యత్ రాజకీయం ఉందనే చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం సీఎం కేసీఆర్ గజ్వెల్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వచ్చే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం.. ఆయన ఆలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నట్టు సమాచారమ్. యాదాద్రి ఆలయ పునర్మాణాన్ని వైభవంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రెడిట్ ని పూర్తిగా వాడుకొనే క్రమంలో ఆలేరు నుంచి సీఎం కేసీఆర్ బరిలోకి దిగుతారని చెబుతున్నారు.
అందులో భాగంగానే ఆ నియోజకవర్గంలోని వాసమర్రి నుంచి రాజకీయం మొదలెట్టారు. ఇదీగాక.. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి వాసలమర్రి కూతవేటు దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి యాదాద్రికి వచ్చే మార్గమధ్యంలో వచ్చే గ్రామం. ఈ రెండు కారణాలు మాత్రమే కాదు.. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత వాసలమర్రి పరిసరప్రాంతాల్లో దాదాపు వెయ్యి ఎకరాల భూమిని కొనుగోలు చేసిందనే ప్రచారం ఉంది. మొత్తానికి.. వ్యూహాత్మకంగా వాసాలమర్రి గ్రామ అభివృద్ది అజెండాని ఎత్తుకున్నారు కేసీఆర్ అన్నది సుస్పష్టం.