యాదాద్రి భక్తులకి శుభవార్త
మహమ్మారి కరోనా దేవుళ్లు కూడా వదల్లేదు. తొలివిడత కరోనా లాక్డౌన్ తో దేశవ్యాప్తంగా ఆలయాలన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ లోనూ మరోసారి ఆలయాలు మూతపడ్డాయ్. ఈ క్రమంలో తెలంగాణ తిరుపతి యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని కూడా గతకొద్ది రోజులుగా మూసి ఉంచారు.
ఐతే తెలంగాణలో పూర్తిగా లాక్డౌన్ ఎత్తివేయడంతో ఆదివారం నుంచి యాదాద్రి ఆలయం తిరిగి తెరచుకొంది. భక్తులకి దర్శనాలకు అనుమతిని ఇస్తున్నారు. అయితే దర్శనం సందర్భంగా కరోనా నిబంధనలు పాటించాలని ఆలయ అధికారులు సూచిస్తున్నారు. తప్పకుండా మాస్క్ ధరించాలి. సామాజిక దూరం పాటించాలని కోరుతున్నారు.
మరోవైపు యాదాద్రి పునర్మాణ పనులు దాదాపు పూర్తికావొస్తున్నాయి. కొండ కింద రోడ్డు మార్గపు వెడల్పు పనులు కూడా మొదలయ్యాయ్. ఈ క్రమంలో రోడ్ కటింగ్ లో పోయిన షాపులు, భవనాలని తొలగించే పనులు జోరుగా సాగుతున్నాయి. రోడ్డు వెడల్పు పనులు పూర్తయితే.. యాదాద్రి ఆలయ పునర్మాణ పనులు దాదాపు పూర్తయినట్టేనని చెబుతున్నారు.