యాదాద్రిలోని 421 గ్రామాలని సీఎం కేసీఆర్ దత్తత
యాదాద్రి-భువనగిరి జిల్లాలోని గ్రామాల అభివృద్దికి సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నట్టున్నారు. వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చిన కేసీఆర్.. ఈరోజు ఆ ఊరికి వెళ్లారు. గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. 23 రకాల కూరలతో గ్రామస్థులకి భోజనాలు పెట్టారు. గ్రామ అభివృద్దిపై ప్రజలతో మాట్లాడారు. ఇకపై వాసాలమర్రి నా ఊరు. గ్రామంలోని ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యులు అన్నారు. గ్రామాన్ని అద్భుతంగా అభివృద్ది చేసుకుందాం. ఇందుకోసం రూ.100-150కోట్లు ఖర్చు చేసేందుకు రెడీగా ఉన్నానని తెలిపారు.
సీఎం కేసీఆర్ వరాలు ఒక్క వాసాలమర్రికి మాత్రమే పరిమితం కాలేదు. వాసాలమర్రి వేదికగా యాదాద్రి-భువనగిరిలోని 421 గ్రామాలకి నిధులు ప్రకటించారు. ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 25 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నాన్నారు.. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలకు కూడా నిధులు మంజూరు చేస్తాను. భువనగిరి మున్సిపాలిటికీ రూ. కోటి, మిగతా ఐదు మున్సిపాలిటీలకు రూ. 50 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో యాదాద్రి-భువనగిరి జిల్లా ప్రజలు ఖుషి అవుతున్నారు. సీఎం కేసీఆర్ ఒక్క వాసాలమర్రిని మాత్రమే కాదు.. జిల్లాలోని 421 గ్రామాలని దత్తత తీసుకున్నారని గొప్పగా చెప్పుకుంటున్నారు.
అయితే సడెన్ గా యాదాద్రి-భువనగిరి జిల్లాపై సీఎం కేసీఆర్ కు ప్రేమ పెరగడం వెనక రాజకీయం కోణం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వెల్ నుంచి పోటీ చేయడం లేదు. ఆలేరుకి షిఫ్ట్ కానున్నారు. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ ఆలయాన్ని అద్భుతంగా పునర్మాణం చేపట్టిన సీఎం కేసీఆర్.. అక్కడి ఎమ్మెల్యేగానే ఉండాలని ఆశపడుతున్నారు.అందుకే ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలెట్టారు. గ్రామాల అభివృద్ది కోసం పనులు మొదలెట్టారు. రేపటిరోజున ఈ పనులే కేసీఆర్ ని రికార్డ్ మెజారిటీతో గెలిపిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.