తెలంగాణ రైతులకి గుడ్ న్యూస్

తెలంగాణ రైతులకి ఓ గుడ్ న్యూస్. ఇటీవలే రైతుబంధు పైసలు రైతుల ఖాతాల్లో జమ అయిన సంగతి తెలిసిందే. అయితే వాటిని తీసుకొందామని బ్యాంకులకు వెళ్తున్న రైతులకి షాక్ తగులుతోంది. రైతుబంధు పైసలని రైతు రుణమాఫీ వడ్డీకి కట్ చేసుకుంటున్నాయ్ బ్యాంకులు. దీనిపై రైతులు ఆందోళన, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వీటికి సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ్. తాజాగా ఈ విషయంపై ప్రభుత్వం స్పందించింది.

రైతుబంధు పైసలని బ్యాంకులు ఏ రకంగా ఆపడానికి వీల్లేదని స్పష్టమైన ఆదేశాలు బ్యాంకులకు వెళ్లాయి. ఆర్థిక మంత్రి  హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్‌లు బ్యాంకర్లతో మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో అత్యవసర సమావేశం నిర్వహించారు. రైతుబంధు నిధులను నిలిపివేయడానికి ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని ఈ సందర్భంగా బ్యాంకర్లు తెలిపారు. భవిష్యత్తులో రైతుబంధుకు సంబంధించి ఎలాంటి మొత్తాన్ని నిలిపివేయవద్దని ఆర్ధిక మంత్రి బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిలిపివేయబడిన / సర్దుబాటు చేయబడిన ఏదైనా మొత్తం ఉన్నట్లయితే తిరిగి రైతుల ఖాతాకు జమ చేయాలన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి రెండు టోల్ ఫ్రీ నెంబర్లు (18002001001, 04033671300) ప్రభుత్వం ఏర్పాటు చేసింది.