పీసీసీ ఒకరికి ఇస్తే.. మరొకరు జంప్ ?

తెలంగాణ పీసీసీ చీఫ్ విషయంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతుంది. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డిల మధ్యనే ప్రధాన పోటీ ఉంది. వీరిద్దరు కొద్ది రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ఎవరికి పీసీసీ ఇచ్చినా మరొకరు పార్టీలో ఉండరన్న ప్రచారం ఉంది. 

ఇటీవల ఈటెల బీజేపీలో చేరే సమయంలో.. రేవంత్ రెడ్డి నుంచి ఓ రాయభారం  వెళ్లింది. ఈటెలని భాజాపాలో చేరకుండా కొద్దిరోజులు ఆగమని దాని సారాంశం. ఎందుకంటే ? ఆలోగా పీసీసీ చీఫ్ వ్యవహారం తేలిపోతుంది. తనకు పీసీసీ పదవి రాకుంటే.. కోదండరామ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటెల, తీన్మార్ మల్లన్న తదితరులని కలుపుకొని కొత్త పార్టీకి కసరత్తు చేద్దామనే ఆలోచనలో రేవంత్ ఉన్నారనే వార్తలు వినిపించాయి. కానీ రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ ని ఈటెల ఓకే చేయలేదు. ఆయన దారి ఆయన చూసుకున్నారు.

కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డిది కూడా దాదాపు ఇదే పరిస్థితి. పీసీసీ పదవి దక్కిందా సరేసరి. లేదంటే.. తమ్ముడు కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి ఆయన భాజాపాలో చేరడం దాదాపు ఖాయమని చెబుతున్నారు. ఎప్పటి నుంచే రాజగోపాల్ రెడ్డి కమలం పాట పాడుతున్నారు. తమ్ముడితో కలిసి వెంకట్ రెడ్డి గొంతు కలిపేందుకు రెడీగా ఉన్నట్టు సమాచారమ్. అన్న-తమ్ముళ్లు ఒకేసారి భాజాపాలో చేరితే.. వారికి డబుల్ ప్యాకేజ్ ఆఫర్ కూడా ఉందట. 

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ హైకమాండ్ మధ్యేమార్గంలో వెళ్లాలని చూసింది. ఆ మధ్యలో జీవన్ రెడ్డి పేరు ఖరారైనట్టు వార్తలు వచ్చాయ్. అయితే జీవన్ రెడ్డి నిరాకరించారట. ఇప్పుడు.. శ్రీదర్ రెడ్డి పేరు కొత్తగా తెరపైకి వచ్చింది. ఆయన కూడా అందుకు రెడీగా ఉన్నారు. కానీ దిగువ స్థాయి కార్యకర్తలు మాత్రం శ్రీధర్ రెడ్డికి పదవి ఇవ్వడంపై సంతృప్తిగా లేరని తెలుస్తోంది. మరీ.. ఫైనల్ గా తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ ఎవరు అవుతారో.. అదెప్పుడు తేలుతుందో చూడాలి.