టీ-కాంగ్రెస్ నేతలు గంపగుత్తగా బీజేపీలోకి ?

తెలంగాణ కాంగ్రెస్ నేతలు కట్టకట్టుకొని మరీ.. బీజేపీలో చేరే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారమ్. కొత్త పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు అధిష్టానం నుంచి రాష్ట్ర నేతలకు స్పష్టమైన సంకేతాలు అందినట్టు చెబుతున్నారు. ఏ క్షణమైనా రేవంత్ రెడ్డి పేరుని అధికారికంగా ప్రకటించనున్నారని తెలిసింది. 

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్లాన్-బి ని అమలు చేయాలనే ప్లాన్ లో ఉన్నారట. సీనియర్లంతా కట్టకట్టుకొని బీజీపీలో చేరే ఆలోచనలో ఉన్నారట. వీరితో పాటు మరికొందరు యువ నేతలని తీసుకెళ్లాలని చూస్తున్నారట. ఈ మేరకు ఇప్పటికే అధిష్టానానికి సంకేతాలు పంపి.. రేవంత్ రెడ్డికి పీసీసీ పోస్ట్ దక్కకుండా చివరి ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్. 

ఇక పీసీసీ పదవి కోసం రేవంత్ రెడ్డి-కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డిల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఎవరు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఢిల్లీలో తిష్టవేసి.. ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపుతోంది. ఆయన పేరుని ఖరారు చేసింది. సీనియర్లని కాస్త బుజ్జగించిన తర్వాత ఆయన పేరుని అధికారికంగా ప్రకటించాలని చూస్తోంది. కానీ సీనియర్లు చల్లబడేలా లేరు. రేవంత్ రెడ్డిని సాకుగా చూపి.. పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. సీనియర్లు పోతే పోనీ.. రేవంత్ రెడ్డికే పీసీసీ పోస్ట్ అన్నట్టుగా అధిష్టానం ఉన్నట్టు టాక్.