డెల్టా ప్లస్ వేరియంట్.. మళ్లీ ఆంక్షల దిశగా రాష్ట్రాలు
ఇక కరోనా సెకండ్ వేవ్ తప్పిందని సంతోషించే లోపే డెల్టా ప్లస్ వేరియంట్ కలవరపెడుతోంది. రోజుకో కొత్త రాష్ట్రానికి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా రాజస్థాన్‌లో తొలి కేసు నమోదైంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో 52 కేసులు నమోదయ్యాయి. థర్డ్ వేవ్ ముప్పునకు ఈ రకమే కారణమయ్యే అవకాశం ఉందంటోన్న నిపుణుల హెచ్చరికలతో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.
డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదైన రాష్ట్రాలని కేంద్రం అప్రమత్తం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది. జన సమూహాలను నియంత్రించడంతో పాటు భారీగా పరీక్షలు చేయాలని, వ్యాక్సినేషన్‌ను పెంచాలని సూచించింది. డెల్టా ప్లస్ కేసులు వస్తున్న జిల్లాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. డెల్టా కేసుల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలని మరోసారి కఠినతరం చేసింది.