ఏపీ పరువుపోయే పని !

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోంది. ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రులు దారుణ వ్యాఖ్యలు చేస్తున్నారు. వైఎస్ ఆర్ నీటి దొంగ, సీఎం జగన్ నీటి గజదొంగ అంటూ తిట్టిపోస్తున్నారు. తెలంగాణ మంత్రులు దారుణ వ్యాఖ్యలు చేస్తున్నా.. ఏపీ మంత్రులు ఖండించలేకపోతున్నారు. మరో వైపు కేసీఆర్ కేంద్రానికి లేఖ రాయడంతో రేపోమాపో కృష్ణాబోర్డు సీమ ఎత్తిపోతల ప్రాంతాన్ని పరిశీలించనున్నట్లుగా తెలుస్తోంది.

కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా ఫోన్ చేశారు. కేఆర్ఎంబీ బృందాన్ని కేంద్ర బలగాల రక్షణతో పంపుతున్నామని హామీ ఇచ్చారు. కేంద్ర బలగాలు ఎందుకంటే ? గతంలోనే… కేఆర్ఎంబీ బృందం… ప్రాజెక్టును పరిశీలించాలని నిర్ణయించుకుంది. కానీ ఏపీ ప్రభుత్వం సహరించలేదు. శాంతి భద్రతల సమస్య అంటూ.. లేఖలు రాసింది. ఈ నేపథ్యంలో కేంద్ర బలగాల సాయంతో కేఆర్ఎంబీ బృందం రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని సందర్శించనుంది.

స్టే ఉన్నా రాయలసీమ ఎత్తిపోతల పధకం నిర్మాణ పనులు చేసినట్లుగా తేలితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైలుకు పంపుతామని ఇప్పటికే జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఈ వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా పరిష్కరించుకోవాలి. లేదంటే ఏపీ పరువు జాతీయ స్థాయిలో పోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.