రామారావు టు రజనీకాంత్‌.. వీళ్లంతా లోకలా ?

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మా అధ్యక్ష పోటీలో ప్రకాష్ రాజు, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ ఉంటున్నట్టు ప్రకటించారు. అయితే ప్రధాన పోటీ మాత్రం ప్రకాష్ రాజు – మంచు విష్ణుల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఇంతలో లోకల్ & నాన్ లోకల్ కార్డ్ తెరపైకి వచ్చింది. ప్రకాష్ రాజ్ నాన్‌లోకల్‌ అని.. ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విమర్శకులకు దర్శకుడు రాంగోపాల్‌ వర్మ కౌంటర్‌ విసిరారు.

“కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చిన ప్రకాశ్‌రాజ్‌ నాన్‌లోకల్ అయితే, గుడివాడ నుంచి చెన్నైకి వెళ్లిన రామారావు, నాగేశ్వరరావు, బుర్రిపాలెం నుంచి మద్రాస్ వెళ్లిన కృష్ణ, తిరుపతి నుంచి మద్రాస్ బయల్దేరిన మోహన్‌బాబు లోకలా? మహారాష్ట్ర నుంచి ఎక్కడెక్కడికో వెళ్లిన రజనీకాంత్, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి మహారాష్ట్రకి వెళ్లిన అమితాబ్‌ బచ్చన్ లోకలా ?

30 ఏళ్లుగా ఇక్కడే ఉండి తెలుగు నేర్చుకొని, చలం పుస్తకాలని ముద్రించి, భార్యాపిల్లలతో ఇక్కడే ఉంటూ, తెలంగాణలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడున్న ఎంతోమంది మహిళలకు పని కల్పిస్తున్న ఆయన నాన్ లోకలా? ప్రకాశ్‌రాజ్‌లోని ప్రతిభ గుర్తించిన ఈ దేశం నాలుగుసార్లు ఆయన్ని శాలువా కప్పి జాతీయ అవార్డుతో సత్కరిస్తే.. ఇప్పుడు అదే వ్యక్తిని నాన్‌లోకల్‌ అంటున్నాం” అని ఆర్జీవీ వరుస ట్వీట్లు చేశారు.