అది టీ-కాంగ్రెస్ కాదు.. టీ-టీడీపీ !

పీసీసీ పదవి తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చుపెట్టింది. రేవంత్ రెడ్డి నియామకంపై కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు మాదిరిగానే పీసీసీ ఎంపిక జరిగిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్యం ఠాగూర్.. పీసీసీ పదవిని అమ్ముకున్నారని అన్నారు. రేవంత్ కు చంద్రబాబు పదవి ఇప్పించారు. అది టీ-కాంగ్రెస్ కాదు.. టీ-టీడీపీ. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీ-టీడీపీ కనీసం డిపాజిట్లు అయినా దక్కించుకోవాలని కోరుకుంటున్నా అన్నారు.

ఇకపై గాంధీ భవన్ మెట్లు ఎక్కనని వెంకట్ రెడ్డి అన్నారు. తన సొంత నియోజకవర్గం పరిధిని మాత్రమే చూసుకుంటా. ఇబ్రహీం పట్నం నుంచి భువనగిరి వరకు పాదయాత్ర చేస్తానని తెలిపారు. కార్యకర్తలు, ప్రజలే తన భవిష్యత్ రాజకీయాలని నిర్ణయిస్తారని అన్నారు. కొత్త కార్యవర్గం గానీ, సీనియర్ నేతలు గానీ తనని కలవడానికి ప్రయత్నించవద్దని వెంకట్ రెడ్డి కోరారు. మొత్తానికి.. వెంకట్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు అర్థమవుతోంది. కొద్దిరోజుల తర్వాత ఆయన కోపం తగ్గి పార్టీలో చేరుతారా ? లేక బీజేపీ లేదా తెరాసలో చేరడానికి ప్రయత్నాలు చేస్తారా ?? అన్నది చూడాలి.