రేషన్ బియ్యంలో కోత.. ఒక్కోక్కరికి 5కిలోలు మాత్రమే !

తెలంగాణలో రేషన్‌ కార్డుదారులకు ఇచ్చే బియ్యం కోటాలో కోత పడింది. జులై నెల కోటా కింద మనిషికి అయిదు కిలోలే ఉచితంగా ఇవ్వాలంటూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ వి.అనిల్‌కుమార్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

కరోనా రెండో దశ తీవ్రత నేపథ్యంలో ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో కార్డుదారు కుటుంబం లోని ఒక్కొక్కరికీ 5 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం దానికి మరో అయిదు కిలోలు కలిపి అందిస్తామని పేర్కొంది.

ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించి మొత్తం ఒక్కొక్కరికి 30 కిలోలు ఇవ్వాలి. ఇప్పటికి 25 కిలోలే అందాయి. ఇంకా 5 కిలోల బకాయి ఉంది. జులైలో బకాయి 5 కిలోలు, కేంద్ర, రాష్ట్ర కోటాలు కలిపితే ఒక్కొక్కరికి 15 కిలోలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ తాజా ఉత్తర్వుల్లో ఒక్కొక్కరికి 5కిలోలో మాత్రమే ఇవ్వాలని పేర్కొన్నారు.