జల వివాదం :మరోసారి ప్రధానికి లేఖ రాసిన జగన్

తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాయలసీమ ప్రాజెక్ట్ అక్రమం అని తెలంగాణ ఆరోపిస్తోంది. మరోవైపు ఆ ప్రాజెక్ట్ పనులని ఏపీ సలైంట్ గా కొనసాగిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిపై దృష్టిపెట్టింది. నిరంతరాయంగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ కాస్త విద్యుత్ వార్ గా టర్న్ తీసుకొంది. అన్నీ ప్రాజెక్టుల వద్ద పోలీసుల పహారా వరకు వెళ్లింది.

ఈ నేపథ్యంలో ఇది వరకే ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాశారు. తాజాగా మరోసారి జగన్ ప్రధానికి లేఖ రాశారు. ఈ సారి ఆయన జల, విద్యుత్ వివాదాలని ప్రస్తావిస్తూనే.. పదే పదే జలశక్తి శాఖకు, కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేసినా వివాదాలు పరిష్కారం కావటం లేదని పేర్కొన్నారు.

“సాగునీటికి సంబంధించిన అవసరాలు ఉన్నప్పటికీ తెలంగాణ నిరంతరాయంగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుండటం రైతుల ప్రయోజనాలకు నష్టం కలిగిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టులో 834 అడుగుల దిగువన నీటిని ఏపీ వినియోగించుకోలేదని తెలిసే తెలంగాణ విద్యుత్‌ను ఉత్పత్తి చేయటం దారుణం. జూన్‌ 1 నుంచి 26 టీఎంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తే అందులో 19 టీఎంసీల నీటిని విద్యుత్‌ ఉత్పత్తి కోసం వాడేశారు. ఉమ్మడి ప్రాజెక్టులపై కేఆర్‌ఎంబీతో పాటు సీఐఎస్‌ఎఫ్‌ రక్షణ కల్పించేలా ఆదేశించాలి” అని లేఖలో పేర్కొన్నారు.