రివ్యూ : విక్రమార్కుడు – కొత్తదనం ఏమీ లేదు
చిత్రం : విక్రమార్కుడు (2021)
నటీనటులు : విజయ్ సేతుపతి, సాయేషా, మడోనా సెబాస్టియన్, యోగిబాబు, సురేశ్ చంద్ర మేనన్ తదితరులు
సంగీతం : సిద్ధార్థ్ విపిన్
దర్శకత్వం : గోకుల్
నిర్మాత : విజయ్ సేతుపతి, అరుణ్ పాండియన్, డాక్టర్ కె.గణేశ్, ఆర్.ఎం.రాజేశ్‌కుమార్
విడుదల : ఓటీటీ – ఆహా
విడుదల తేది : 09 జులై, 2021.
కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతికి టాలీవుడ్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవల ఆయన నేరుగా తెలుగు సినిమాలు చేస్తున్నారు. ఆయన తమిళ సినిమాలు కూడా తెలుగులో డబ్ అవుతున్నాయి. ఆయన కథానాయకుడిగా గోకుల్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ యాక్షన్ కామెడీ చిత్రం ‘జుంగా’. బాక్సాఫీస్ వద్ద అలరించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో ‘ఆహా’ ఓటీటీ వేదికగా ‘విక్రమార్కుడు’గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ తెలుగు ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుంది ? రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
జుంగా (విజయ్ సేతుపతి) కండక్టర్‌గా పనిచేస్తుంటాడు. తను పనిచేసే రూట్లో రోజూ బస్సు ఎక్కే తమిళ అమ్మాయి (మడోనా సెబాస్టియన్)ను ప్రేమిస్తాడు. ఈ క్రమంలో కొందరు ఆకతాయిలని చితకొడతాడు. ఈ విషయం తెలిసిన జుంగా తల్లి(శరణ్య) కోప్పడుతుంది. జుంగా తండ్రి, తాతలు ఇలా గొడవలకు వెళ్లి.. కుటుంబాన్ని సర్వనాశనం చేశారని, అందుకే తనని వాటికి దూరంగా తీసుకొచ్చి పెంచుతున్నానని చెబుతుంది. తన తండ్రి, తాతను మోసం చేసి, సినిమా ప్యారడైజ్ అనే థియేటర్‌ను రెడ్డి(సురేశ్ చంద్రమేనన్) తక్కువ ధరకే దక్కించుకున్నాడన్న విషయం తల్లి ద్వారా జుంగాకు తెలుస్తుంది. దీంతో ఆ థియేటర్‌ను ఎలాగైనా తిరిగి సొంతం చేసుకోవాలని తన స్నేహితుడు యోయో(యోగిబాబు)తో కలిసి చెన్నై బయలుదేరతాడు జుంగా. థియేటర్ కోసం జుంగా ఏం చేశాడు? డాన్‌లా ఎలా మారాడు? రెడ్డి కూతురు యాళిని(సయేషా) ప్రేమను ఎలా దక్కించుకున్నాడు? అన్నది పూర్తి కథ.
నటీనటుల ఫర్ ఫామెన్స్ :
హీరో కుటుంబాన్ని మోసం చేసే విలన్.. హీరో అతడి దగ్గరకు వెళ్లి తన తండ్రి, తాత ఆస్తులను తిరిగి ఇచ్చేయమని చెప్పడం.. అప్పుడు హీరోను విలన్ అవమానించడం.. ఆ వెంటనే హీరో సవాళ్లు, ప్రతిజ్ఞలు చేయటం.. ఈ పాయింట్‌తో చాలా సినిమాలొచ్చాయ్. విక్రమార్కుడు కూడా ఇదే పాయింట్ తో తెరకెక్కింది. ఈ రొటీన్ కథని విజయ్ సేతుపతి లాంటి హీరో ఓకే చేయడం ఆశ్చర్యాన్ని కలిగించేదే. ప్రథమార్ధమంతా పరమ రొటీన్‌గా, విసుగెత్తించేలా సాగుతుంది. ద్వితీయార్థం కాస్త పర్వాలేదు. యోగిబాబు కాసిన్ని నవ్వులు పంచాడు.
విజయ్ సేతుపతి నటనకి వంక పెట్టలేం. కానీ కథ బలంగా లేనప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తారు. కథానాయికలు మడోనా సెబాస్టియన్, సాయేషాలు పర్వాలేదు. యోగిబాబు ఈ సినిమాకు ప్రధానబలం. చాలా వరకూ తనదైన టైమింగ్‌తో మెప్పించాడు. చాలా చోట్ల కథను తన భుజాలపై మోశారు. మిగిలిన నటీనటులు తమ తమ పరిధి మేరకు నటించారు.
సాంకేతికంగా :
టెక్నికల్ గా కూడా విక్రమార్కుడు అంత గొప్పగా ఏమీ లేడు. సిద్ధార్థ్ విపిన్ అందించిన సంగీతం పర్వాలేదు. వి.జె. సాబు జోసెఫ్ ఎడిటింగ్‌కు ఇంకాస్త పని చెప్పాల్సిందే. నిర్మాణ విలువలు బాగున్నాయి. విజయ్ సేతుపతి సినిమా అని ఆసక్తి చూపించిన తెలుగు ప్రేక్షకులని విక్రమార్కుడు నిరాశపరిచాడనే చెప్పాలి.
ఫైనల్ గా : ఇది విజయ్ సేతుపతి మార్క్ సినిమా కాదు. రొటీన్ సినిమా. రొటీన్ విక్రమార్కుడు.
రేటింగ్ : 2.5/5
నోట్ : ఇది సమీక్షకుడి వ్యతిగత అభిప్రాయం మాత్రమే.