కాస్ట్లీ కారు కేసులో హీరో విజయ్ కి జరిమానా !
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కి ఫైన్ పడింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న తన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు కేసులో న్యాయస్థానం ఆయనకు జరిమానా విధించింది. ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్న ఈ లగ్జరీ కారుకు పన్ను కట్టనందుకు గానూ హైకోర్టు రూ.లక్ష జరిమానా విధించింది. రూ.లక్ష జరిమానాను 2 వారాల్లోగా సీఎం కొవిడ్ సహాయ నిధికి చెల్లించాలని ఆదేశించింది.
దాదాపు రూ. 7.95కోట్ల విలువైన ఈ రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారుకు పన్ను మినహాయింపు కోరుతూ విజయ్ హైకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్ను న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎం సుబ్రమణియన్ కొట్టివేశారు. పన్ను చెల్లించడం ప్రతి పౌరుడి విధి. రీల్ హీరోలు రియల్ హీరోలుగా నిలవాలని కోర్టు సూచించింది.