తెలంగాణ కాంగ్రెస్ లోకి భాజాపా నేతల క్యూ !

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంతో తెలంగాణ కాంగ్రెస్ కు ఊపొచ్చింది. ఇన్నాళ్లు ఆ పార్టీ నుంచి నేతలు బయటికి వెళ్లడమే చూశాం. ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. ఇతర పార్టీల కాంగ్రెస్ లోకి వలసలు మొదలయ్యాయి. తెలంగాణలో తెరాస ప్రత్యామ్నాయం తామేనని గట్టిగా చెప్పుకుంటున్న భాజాపా నుంచి కాంగ్రెస్ లోకి వలసలు మొదలవ్వడం విశేషం.

ఇవాళ ముగ్గురు నేతలు తనను కలిసి పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారని రేవంత్ తెలిపారు. వారిలో భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ సోదరుడు, నిజామాబాద్ మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మహబూబ్‌నగర్‌ భాజపా జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్‌ ముదిరాజ్, భూపాల్‌పల్లికి చెందిన తెదేపా మాజీ నేత గండ్ర సత్యనారాయణలు ఉన్నట్లు వివరించారు.

మరోవైపు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. దీంతో ఆయన కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తెరాస నుంచి బయటికొచ్చిన విశ్వేశ్వర్ రెడ్డి.. ఇంకా ఏ పార్టీలో చేరలేదు. భాజాపాలో చేరుదామనే ఆలోచన చేశారు. కానీ చేరలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ పదవి దక్కడంతో ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రేవంత్ కు ఆయన సన్నిహితుడు కూడా.