కేసీఆర్ జైలుకు.. బండికి చెప్పారట !
కేంద్ర పథకాలని తెలంగాణలో అమలు చేయడానికి సీఎం కేసీఆర్ మొదట్లో నిరాకరించారు. ఆ పథకాలు దండగ. అంతకంటే మంచి పథకాలని రాష్ట్రం ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పుకొచ్చారు. ఓ దశలో అయితే కేంద్ర పథకాలని రాష్ట్రంలో అమలు చేసేది లేదని ఖరాఖండిగా చెప్పేశారు. అయితే దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల తర్వాత కేసీఆర్ లో మార్పు వచ్చింది. ఆయన కాస్త తగ్గారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్ద పెద్దలకు వంగి వంగి దండాలు పెట్టొచ్చారు. రాష్ట్రంలో కేంద్ర పథకాలని అమలు చేసేందుకు అంగీకరించారు. ఇప్పుడు అమలు చేస్తున్నారు కూడా. కేసీఆర్ లో ఈ మార్పు వెనక కేసుల భయం ఉంది. ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి కేంద్రం రెడీ అవుతోందనే వార్తలు అప్పుడు వినిపించాయి.
అవి నిజమే అని తాజాగా మరోసారి స్పష్టం చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. శనివారం హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న బండి.. సీఎం కేసీఆర్ను జైలుకు పంపడం ఖాయమని తమ పార్టీ అధ్యక్షుడు నడ్డా తనకు చెప్పారని చెప్పుకొచ్చారు. అధికారం చెలాయించే పార్టీకి అభ్యర్థి దొరకడం లేదని ఎద్దేవా చేశారు. హుజురాబాద్ లో ఈటెల గెలుపు ఖాయం. 71 శాతం ఓట్లతో ఈటల రాజేందర్ గెలుస్తాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడంతో సీఎం కేసీఆర్కు నిద్ర పట్టడం లేదన్నారు.
ఇక దఌతబంధు పథకంపై బండి తనదైన శైలిలో పంచులేశారు. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలని సీఎం కేసీఆర్ ఎప్పుడైనా నెరవేర్చారా ? అని ప్రశ్నించారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి ఏమైంది ? ఎరువులు ఉచితంగా ఇస్తామన్న హామీ ఏమైంది?? అని ప్రశ్నించారు. బండి తన ప్రసంగంలో సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం. ఈ మేరకు అధిష్టానం నుంచి తనకు సంకేతాలు వచ్చాయని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.