కరోనా గైడ్ లైన్స్ ని పొడిగించిన కేంద్రం

ఆగస్టు 31 వరకు కరోనా గైడ్ లైన్స్ ని పొడగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు లేఖలు రాశారు. పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న జిల్లాల్లో కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. 

‘క్రియాశీల కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అన్ని కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్నాయి. కొవిడ్‌ కేసుల సంఖ్య క్షీణించడం సంతృప్తికరంగా ఉన్నప్పటికీ.. కొత్త కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్న విషయాన్ని గుర్తించాలి. అందుకే అశ్రద్ధ వహించొద్దు’ అని లేఖలో పేర్కొన్నారు. రానున్న పండుగల నేపథ్యంలో ప్రజలు గుమిగూడే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.