యుఎస్ లో మళ్లీ కరోనా పంజా.. ఒక్కరోజే 88వేల కేసులు !

కరోనా మహమ్మారి ఏ దేశాన్ని, ఎవ్వరినీ వదలడం లేదు. అమెరికాలో మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. గడిచిన 24 గంటలో అమెరికాలో 88,376 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత అమెరికాలో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదవడం మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం.

జులై 25తో ముగిసిన వారంలో అగ్రరాజ్యంలో 5లక్షలకు పైగా కేసులు వెలుగుచూశాయి. అంతక్రితం వారంతో పోలిస్తే ఇది 131శాతం ఎక్కువ కావడం గమనార్హం. ప్రస్తుతం అక్కడ వారానికి సగటు కొత్త కేసుల సంఖ్య 60వేలకు పైనే ఉంటోంది. జూన్‌ నెలతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు ఎక్కువ. వ్యాక్సినేషన్‌ రేటు తగ్గుముఖం పట్టడం, డెల్టా వేరియంట్‌ విస్తృతే తాజా ఉద్ధృతికి కారణమని నిపుణులు చెబుతున్నారు.