డేంజర్ : R-ఫ్యాక్టర్ పెరుగుతోంది
దేశంలో మళ్లీ కరోనా డేంజర్ బెల్స్ మ్రోగుతున్నాయి. కరోనా ఇన్ఫెక్షన్ వ్యాప్తి వేగాన్ని తెలియజెప్పే ఆర్-ఫ్యాక్టర్ (రీ ప్రొడక్షన్ రేట్) దేశంలో క్రమేపీ పెరుగుతోంది. కొవిడ్ బారిన పడిన వారి నుంచి వైరస్ ఇతరులకు సంక్రమించే తీరును ఆర్-ఫ్యాక్టర్ తెలుపుతుంది. ఉదాహరణకు ఇది 0.95 ఉందంటే.. కొవిడ్ సోకిన ప్రతి 100 మంది ద్వారా ఇన్ఫెక్షన్ మరో 95 మందికి సోకుతుందని అర్థం.
ఇప్పుడీ ఆర్-ఫ్యాక్టర్ 1కి చేరువవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేరళతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. మెట్రో నగరాలైన పుణె, దిల్లీల్లోనూ ఆర్-ఫ్యాక్టర్ పెరుగుతున్నట్లు చెన్నైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ పరిశోధకులు తెలిపారు. కేరళలో ఆర్-ఫ్యాక్టర్ ఏకంగా 1.11 ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో త్రిపుర, మణిపుర్ మినహా మిగిలిన అన్నిచోట్ల 1 దాటింది. మణిపుర్లో కూడా 1కి చేరువగా ఉంది. ఇది కరోనా థర్డ్ వేవ్ కు దారితీసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.