కరోనా : గుడ్ న్యూస్ చెప్పిన జర్మనీ శాస్త్రవేత్తలు

కరోనా మహమ్మారి యేడాదిన్నర కాలంగా ప్రపంచ దేశాలని వణికిస్తోంది. కోట్ల మంది దీని బారినపడ్డారు. లక్షల మంది కన్నుమూశారు. రూపాన్ని మార్చుకుంటూ.. కొత్త కొమ్ములతో మరింత ప్రమాదకర కరోనా వేరియెంట్స్ వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ వేవ్ లతో ప్రపంచం వణికిపోయింది. త్వరలో థర్డ్ వేవ్ ముంచుకు రానుందని అంచనా వేస్తున్నారు.

మరోవైపు కరోనాపై పరిశోధనలు జరుగుతున్నాయి. మహమ్మారిని మరింత సమర్థంగా అడ్డుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో జర్మనీ శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. అత్యంత శక్తిమంతమైన మినీ యాంటీబాడీలను తయారు చేశారు. ప్రస్తుత యాంటీబాడీల కంటే వెయ్యి రెట్ల శక్తితో వైరస్‌ను బంధించి, బలహీనపరుస్తాయి. 

95 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలను సైతం తట్టుకుని, సమర్థంగా పనిచేయగలవు. కొవిడ్‌ను అడ్డుకునే ఔషధానికి అవసరమైన లక్షణాలన్నీ వీటికి ఉన్నాయి. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్ల కరోనా కొమ్ము ప్రొటీన్‌ను ఇవి అత్యంత సమర్థంగా అడ్డుకుంటాయని గుర్తించామని తెలిపారు.  గొటింజెన్‌లోని యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్, మ్యాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ బయోఫిజికల్‌ కెమిస్ట్రీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. వీటిని ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువేనట.